వెనక ఇంట్లో ఏదో కోలాహలం వినిపిస్తుంటే కుతూహలం కొద్దీ గోడ మీద నుంచి చూశా.
"తాతయ్యా, సెల్ఫీ
తీసుకుందాం రండి" అని పిలుస్తున్నాడు ఒక అబ్బాయి. ఇంకొక ఇద్దరు అప్పటికే రెడీ
గా ఉన్నారు ఫోను పట్టుకుని.
"ఏమిటి విశేషం?" అని అడిగా.
"ఈ రోజు తాతగారి 84వ పుట్టినరోజు" అని చెప్పి, "సాయంత్రం కేక్ తెస్తాము. మీరు కూడా రండి"
అన్నారు.
తర్వాత చాలా సేపు సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు అందరూ. అలా చూస్తే
ముచ్చటేసింది. “ఇలా ఎంతమందికి జరుగుతది?”
అనుకున్నా.
తాత కి మనవళ్ళు పుట్టినరోజు జరపడం కూడా ఒక విశేషమేనా అని అనుకుంటన్నారా? వాళ్ళు ఆయన మనవళ్లు కాదు. ఆయన ఇంట్లో అద్దెకి ఉండే students. ఆయన కొడుకు అమెరికా లో ఉంటారు. కూతుర్లు ఇక్కడే ఉన్నా, వచ్చేపోయే దూరం కాదు. వాళ్లందరూ ఫోన్లు చేసి మాట్లాడినందుకు ఆయన ఆనంద పడినా, ఈ పిల్లల హడావుడికి చాలా సంతోషపడ్డారు.అది ఆయన మొహం చూస్తేనే తెలిసిపోతంది. దాచుకుందామని శతవిధాల ప్రయత్నించినా, ఆయనవల్ల కాలేదు. ఒంటరిగా కాలం వెళ్ళదీస్తున్న ఆయన ఇంట్లో ఈ సందడి వినటానికి, చూడటానికీ భలే బాగుంది.
వాళ్ళ ఉత్సుకతలో నేను కూడా భాగం అవుదామని gulabjam చేసి ఇస్తుంటే నిన్న గోడ దగ్గర ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి. " పిల్లలు ఉన్నా లేనట్లే, మా లాంటి వాళ్ళ పరిస్థితి. ఈ వయసులో మాట్లాడే మనిషి తోడు లేకుండా ఉండటం అంటే నరకమే. అది తట్టుకోలేకనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటన్నారు."
అలా అంటారు కానీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండటం ఇష్టం ఉండదు మళ్ళీ. ఇంటి
చుట్టుపక్కల వాళ్ళం అస్తమానం మాట్లాడలేము కదా. ఈ రకంగా అయినా అయనతో మాట్లాడటానికి,
అయనకి ఎమైనా చిన్న సహాయం
చేయటానికీ, అందుబటులొ
ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అని తృప్తి గా అనిపించింది.