Wednesday, 6 May 2020

నాన్నగారి వ్యక్తిత్వం


గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళే బస్ ఎక్కి కూర్చున్నా. మీరు ఎల్ ఐ సి విజయ కుమార్ గారి అమ్మాయి కదా?” అన్న ప్రశ్న వినిపించింది. ఊర్లో function కో party కో వెళ్ళినా, walking కో shopping కో వెళ్ళినా, restaurant కి వెళ్ళినా…అంతెందుకు, సరుకులకో కూరగాయలకో వెళ్ళినా కనీసం ఇద్దరైనా నాన్నగారి గురించి అడగకుండా ఉండరు. ఊర్లో అంటే సరే, బస్ లో కూడానా అనుకుంటూ, "అవునండీ, మీరు..?" అని అడిగా."నేను మీ నాన్నగారి agent వాళ్ళ తమ్ముడిని. Sir ఇప్పుడు గుంటూరు లో ఉంటున్నారంట కదా, ఆరోగ్యం ఎలా ఉంది?” అని అడిగి, "Health tips బాగా follow అవుతారు గా బాగానే ఉండి ఉంటదిలే" అని సమాధానం కూడా ఆయనే చెప్పారు. కాసేపాగి, "మాకు మంచి మాటలు చెప్పేవాళ్ళు. బాగా చదువుకోండి, వృద్ధి లోకి వస్తారు అనేవారు ఎప్పుడూ. కాకపోతే ఆ age లో మాకు ఆ మాటలకన్నా  ఆయన bullet మీదే ఎక్కువ దృష్టి  ఉండేది. అప్పట్లో  మా కుర్రాళ్ళందరికీ  అదంటే భలే  craze" అంటూ చెప్పుకొచ్చారు.

నా ఆలోచనలు నా చిన్నతనంలోకి వెళ్ళాయి. నాకు ఊహ తెల్సినప్పట్నుంచీ నాన్నగారిని bullet మీదే చూశాను. నా వయసుకి అది ఒక చిన్నsize ఏనుగు లాగా కనిపించేది. అప్పట్లో అసలు vehicles ఏ తక్కువ, bullets అయితే ఊర్లో ఒకట్రెండు కన్నా ఎక్కువ ఉండేవి కావు.

College లొ చేరాక bullet మీద దించుతంటే తుంటరి కుర్రాళ్ళకి గుండెల్లో దడ. సగం మంది ఆ sound కి, మిగతా సగం నాన్నగారి గంభీరమైన personality కి భయపడేవాళ్ళు. ఆ బండి వల్ల మాకు ర్యాగింగ్ బాధ లేకుండా పోయింది. ఇప్పటికీ classmates ఎవరైనా కనిపిస్తే ఆ బండి ప్రస్తావన తేకుండా ఉండరు. నా చదువు పూర్తి అయ్యేసరికి  అలాంటి గున్న ఏనుగులు (అదేనండీ, బుల్లెట్ లు) అయిదు మార్చారు.

ఆ బుల్లెట్ craze ఎలా ఉండేదంటే, నేను కూడా ఒకట్రెండు సార్లు నడపటానికి try చేశా. నాకు అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే,  నాన్నగారి  వల్ల బుల్లెట్ popular అయిందా, బుల్లెట్ వల్ల నాన్నగారు popular అయ్యారా అని. అసలు ఎక్కడో గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లా వచ్చి ఊర్లో అంత పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకున్నారు ఆయన? ఉద్యోగరీత్యా నరసరావుపేట వచ్చేటప్పుడు అలాంటి ఒక ఊరు ఉందని కూడా వాళ్ళకి తెలీదంట. ఒక్కళ్ళు కూడా పరిచయస్తులు లేరు. అలాంటిది ఇదే సొంత ఊరు లాగా అయిపోయింది. నాకైతే మరీను. నేను months baby గా ఉన్నప్పుడు డు వచ్చారంట నరసరావుపేట కి. ఇంక ఇక్కడే చదువు, పెళ్ళి, ఉద్యోగం అన్నీ. ఒక్కోసారి చాలా విసుగు వస్తది. చిన్న town అయిన ఈ నరసరావుపేటలో ఇరుక్కుపోయాను, ఇంకా better place అయితే better opportunities ఉండేవి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఊరికి నా జీవితం అంకితం అయిపోయింది అనే అసంతృప్తి ఉన్నా ఇక్కడ ఉండబట్టే కదా నాన్నగారి గురించి అందరూ మంచిగా చెప్పుకునే మాటలు తెలుస్తున్నాయి అనే తృప్తి మాత్రం ఉంది. ఇక్కడ ఉండబట్టే కదా నాకు ఇంత గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయి అని గర్వంగా అనిపిస్తుంది.

ఒక్కోసారి ఎందుకు అందరూ ఇంతలా పొగుడుతున్నారు? Retirement function అయితే సందర్భం కాబట్టి చెప్తారు. రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది ఊరు వదిలి 10 సంవత్సరాలు అయింది ఇంకా ఇంత మంది అభిమానం చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటా. ఈ ప్రశ్న నాకు నేను చాలాసార్లు వేసుకున్నా. బహుశా ఇదంతా ఆయన వ్యక్తిత్వానికి వచ్చిన గుర్తింపేమో.

నాన్నగారిని తలుచుకుంటే ముఖ్యంగా నాకు గుర్తు వచ్చే జ్ఞాపకం, మమ్మల్ని నిద్ర లేపడం. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాకపోవటం వల్ల, టైం అవుతుంది లేవండమ్మా అంటూ మెల్లగా తట్టి లేపేవారు. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఎక్కడ నిద్రాభంగం అవుతదో అన్నట్లు అంత సుతిమెత్తగా లేపే వాళ్ళు. మాకేమో అది జోల పాట లాగా ఉండి దుప్పటి ముసుగు పెట్టేవాళ్ళం. సరిగ్గా అయిదు నిమిషాల తరువాత వంట గదిలో నుంచి మట్టి గాజుల చప్పుడు! రాను రాను శబ్దం దగ్గర అవడంతో, ఓహో అమ్మ వస్తుంది లేపటానికి అని అర్థం అయ్యేది. అంతే! ఒక్క ఉదుటున మంచం దిగి, దుప్పటి మడతపెట్టి, పక్క సరిచేసి, bathroom లోకో, wash basin దగ్గరకో పరుగు పెట్టే వాళ్ళం. లేకపోతే ఆ మట్టి గాజులు ఒకట్రెండు మా వీపుల మీద పగిలిపోయేవి.

నేను, అక్క, తమ్ముడు రెడీ అయ్యి వచ్చేసరికి ముగ్గురి shoes polish చేసి cycles తుడిచి పెట్టే వారు. ఎప్పుడూ నోరు తెరిచి ఇది కావాలి అని అడిగే అవకాశం ఇవ్వలేదు మాకు. అన్నీ ముందే అమర్చే వారు. మేము ఏదైనా songs album release అయింది అని చెప్పుకోవటం విన్నారంటే సాయంత్రానికి ఆ album తెచ్చేసేవారు. మాకు మాత్రమే కాదు ఇంటికి చుట్టాలు వస్తే పేరుపేరునా వాళ్ళకి ఇష్టమైన items తెచ్చేవారు. ఎవరికీ ఏ లోటు రానివ్వరు. అలా అని కోట్ల ఆస్థి ఉంది అనుకుంటే పొరపాటే. ఎప్పుడో ఒకసారి మాటల్లో అమ్మ అంది, ఇంట్లో పూచిక పుల్ల కూడా నాన్నగారి సంపాదనతో కొన్నదే అని. ఎందుకంటే నాన్నగారి డిగ్రీ అయ్యేనాటికి ఆయనకి వారసత్వంగా వచ్చింది అప్పులే. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని లాభాల్లోకి తీసుకు రావటం ఎంత కష్టమో, అప్పులు తీర్చి డబ్బు కూడపెట్టడానికి ఆయన అంత కష్ట పడ్డారు. ఉన్నంతలో ఎంతో గొప్పగా పెంచారు మమ్మల్ని.

పిల్లలు ఏదైనా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు అనేది నూటికి నూరుపాళ్ళు నిజం. పది సార్లు చెప్పినా నేర్చుకోనిది మన పెద్దవాళ్ళు ఆచరించి చూపిస్తే అవి మనకి ఇట్టే అలవడతాయి. అలా నాన్నగారి దగ్గర్నుంచి discipline, punctuality, eating healthy, no back-biting లాంటి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఒక విషయం చెప్పారు. “మనం విలువ ఇవ్వవలసింది cadre కి కాదు, మనిషికి. Peon to Principal, cadre మర్చిపో. వ్యక్తికి గౌరవం ఇవ్వు అని. అప్పుడు నాకు గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు L I C office కి వెళ్ళినప్పుడు ఆయన అలాగే behave చేసే వాళ్ళు. గేటు దగ్గర మొదలు పెట్టి అందరినీ పలకరిస్తూ వెళ్ళేవారు. అలా అని ఎక్కువ మాట్లాడరు. ఒకట్రెండు మాటలే! ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అస్సలు ఆసక్తి చూపే వాళ్ళు కాదు. అమ్మ ఒక్కోసారి ఈ విషయంలో గొడవ పడటం నాకు గుర్తే. మీ చుట్టూ మీరు గిరిగీసుకుని కూర్చుంటారు. అందరితో మనసువిప్పి మాట్లాడరే?” అని అనేది. కానీ అది ఆయన పెట్టుకున్న నిబంధన. వ్యక్తిగత విషయాల ప్రస్తావన తేరు. ఆఖరికి తన పిల్లల విషయంలో కూడా. మనం చెప్తే వింటారు, అడిగితే సలహా ఇస్తారు. తనకై తాను కలగజేసుకోరు.

నోరు అదుపుమాట పొదుపు’. ఇది నాన్నగారి నుంచి తెలుసుకున్న ఇంకొక విషయం. నేర్చుకున్న విషయం అని అనకుండా తెలుసుకున్నవిషయం అని ఎందుకు అన్నానంటే అది ఇంకా పూర్తిగా పాటించలేకపొతున్నా కాబట్టి.

నాకు ఎక్కువగా అమ్మ లక్షణాలు వచ్చాయి అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అమ్మ లోని ధైర్యం, తెగువ, పనితనం, అందరినీ కలుపుకోవడం, decision making—ఇలా అన్నిట్లో అమ్మని ప్రతిబింబిస్తూ ఉంటాను. కానీ ఆలోచిస్తుంటే నాన్నగారి ప్రభావం కూడా నా మీద చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి ఒక ఉదాహరణనాన్నగారి నుంచి నాకు వచ్చిన ఒక అలవాటుబయటకి వెళ్లేటప్పుడు ఒక bag carry చెయ్యటం, బండి box లో ఒక bag ఎప్పుడూ పెట్టుకోవటం. నాకు ఊహ తెల్సినప్పట్నుంచీ  చూస్తూనే ఉన్నా. Bag లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు. ఇదే idea ని మేము  ఒకసారి (2018 లో) environment day రోజు promote చేశాం. Walkers అందరినీ request చేశాం. Pocket లో కానీ బండిలో కానీ ఒక bag carry చేసి plastic నుంచి Earth ని save చేయమని. Campaign బాగా click అయింది. దానికి inspiration నాన్నగారే. ఆయన చేసే ప్రతి చిన్న పని చాలా ఆదర్శంగా ఉంటాయి. ఇంకా, ఆయనలో మంచి క్రియేటివిటీ కూడా ఉంది. పనికిరాని వస్తువులతో అధ్భుతమైన కళాఖండాలు తయారు చేస్తారు. ఆయన్ని గమనిస్తూ ఇంకా చాలా నేర్చుకోవచ్చు.

ఇవన్నీ అందరి లో ఉండే మంచి లక్షణాలే.  కానీ ఒక మనిషికి వీటిలో ఒకటో రెండో ఉంటాయేమో. నాన్నగారి లో సకుటుంబ పరివార సమేతంగా ఉండేసరికి ఆయనకి public లో అంత విలువ ఏమో. 

బస్సు కి break పడటంతో నా ఆలోచనలకి కూడా break పడింది. బస్సు దిగి auto ఎక్కా.
Auto Driver: ‘మీరు ఎల్ఐసి కుమార్ గారి అమ్మాయి కదా!’
నేను: అవును
నా పెదాలపై చిరునవ్వు, కళ్ళల్లో వెలుగు, మనసులో గర్వం. నాకు సమాధానం దొరికింది.
మన వ్యక్తిత్వం వల్ల మన విలువ పెరిగితే, మన నడవడిక వల్ల మన గౌరవం పెరుగుతుంది.